ప్రజ్వల్‌ రేవణ్ణపై వేటుకు జేడీఎస్ సిద్ధం .. శిక్ష తప్పదన్న కుమారస్వామి

 




లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్-బీజేపీ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్ధిగా బరిలో దిగిన జేడీఎస్ అధినేత , మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అనూహ్యంగా వీడియోల వ్యవహారంలో చిక్కుకున్నారు. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే బలహీనంగా వున్న జేడీఎస్‌కు ప్రజ్వల్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఒక్క జేడీఎస్‌కే కాదు.. ఆ పార్టీతో పొత్తులో వున్న బీజేపీకి సైతం ఇది ఇబ్బందికర పరిణామమే. 

ఈ నేపథ్యంలో ప్రజ్వల్ వ్యవహారం కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతోందనని ఇరుపార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. సిట్ బలమైన ఆధారాలను సేకరించకపోతే ఇది రాజకీయంగా ఇబ్బందిపెట్టే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు.. ఈ ప్రజ్వల్ వ్యవహారంపై మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మౌనం దాల్చారు. 

దీనిపై ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ స్పందించారు. తమ కుటుంబంపై కుట్ర చేశారని.. ఆ వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివని చెప్పారు. ఇదిలావుండగా.. వీడియోల  వ్యవహారం పార్టీకి ఇబ్బంది కలిగేలా వుండటంతో ప్రజ్వల్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. కుమారస్వామి ఈ మేరకు సంకేతాలిచ్చారు. ప్రజ్వల్ లోక్‌సభ సభ్యుడని.. ఢిల్లీ నుంచే నిర్ణయం తీసుకోవాలని , తప్పు చేస్తే శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు. 

ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ : 
  • ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు
  • దేవెగౌడ పెద్ద కుమారుడు , మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ.. భవాణీ రేవణ్ణల కొడుకే ప్రజ్వల్. ఆయన సోదరుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా వున్నారు. 
  • 2014లో బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ కుటుంబానికి పట్టున్న హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి ఎం మంజుపై విజయం సాధించారు.
  • నవంబర్ 27, 2019లో జేడీఎస్ కర్ణాటక విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ప్రజ్వల్ నియమితులయ్యారు.
  • 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ - జేడీఎస్ కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా హసన్ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇదే స్థానంలో పుట్టస్వామి గౌడ మనవడు 31 ఏళ్ల శ్రేయాస్ ఎం పటేల్‌ను కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రకటించింది. 
  • ప్రజ్వల్ రేవణ్ణ తనకు 40.85 కోట్ల ఆస్తులు వున్నట్లుగా ప్రకటించారు. 2019తో పోలిస్తే తన ఆస్తులు నాలుగు రెట్లు పెరిగాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.



      

Comments